Urmila Matondkar: ఊర్మిలా మతోండ్కర్ ఇన్ స్టాగ్రామ్ హ్యాక్!
- వెరిఫై చేసుకోవాలని డైరెక్ట్ మెసేజ్
- క్లిక్ చేయగానే ఎకౌంట్ హ్యాక్
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
నటిగా ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించిన ఊర్మిళా మతోండ్కర్, ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా రాణిస్తుండగా, ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తన ఖాతాను హ్యాక్ చేశారంటూ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఊర్మిళ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శివసేన పార్టీలో ఉన్న ఆమె, తనకు వచ్చిన ఓ డైరెక్ట్ మెసేజ్ కి సమాధానం ఇవ్వగానే, తన ప్రొఫైల్ ను వారు హ్యాక్ చేశారని ఆమె ఆరోపించారు.
"నా ఇన్ స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయింది. తొలుత వారు డీఎం (డైరెక్ట్ మెసేజ్) పంపించి, కొన్ని స్టెప్స్ ఫాలో అవడం ద్వారా ఎకౌంట్ ను వెరిఫై చేసుకోవాలని కోరారు. నేను వారు చెప్పినట్టు చేయగానే నా ఖాతా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది" అని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె తెలిపారు. తాను సైబర్ సెల్ డీసీపీ రష్మీ కరన్ దికార్ ను కలిసి ఫిర్యాదు చేశానని చెబుతూ, అందుకు సంబంధించిన ఓ చిత్రాన్ని మరో ట్వీట్ లో ఊర్మిళ పోస్ట్ చేశారు.
తన ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో గతంలో ఊర్మిళ పెట్టిన మెసేజ్ లన్నీ డిలీట్ చేసినట్టుగా కనిపిస్తోంది.