Bhuma Akhila Priya: రైతులకు నీళ్లు ఇవ్వకపోతే.. మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వస్తాయి: భూమా అఖిలప్రియ
- ఆళ్లగడ్డ హైవేపై మెరుపు ధర్నాకు దిగిన అఖిలప్రియ
- నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళన
- ఎకరాకు రూ. 50 వేల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నివర్ తుపాను వల్ల పంటను నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని... ఎకరాకు రూ. 50 వేల నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆళ్లగడ్డ హైవేపై ఈరోజు ఆమె మెరుపు ధర్నా చేశారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
రైతులకు నష్ట పరిహారం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అఖిలప్రియ హెచ్చరించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆళ్లగడ్డలో మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వస్తాయని చెప్పారు. మరోవైపు ఈ ధర్నా వల్ల హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనలకు అనుమతి లేదని, ఆందోళనను విరమించాలని అఖిలప్రియను పోలీసులు కోరారు. అయినా చాలా సేపు వారు రోడ్డు మీదే బైఠాయించారు.