Tamilnadu: 58 నిమిషాల్లో 46 వంటకాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన తమిళనాడు బాలిక!
- వంటలు చేయడంలో లక్ష్మీ సాయిశ్రీ అద్భుత ప్రతిభ
- యునికో వరల్డ్ రికార్డుల్లో స్థానం
- కేరళ బాలిక శాన్వి రికార్డు బద్దలు
తమిళనాడుకు చెందిన లక్ష్మీ సాయిశ్రీ అనే బాలిక, కేవలం 58 నిమిషాల్లో 46 రకాల వంటకాలను వండటం ద్వారా యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఎన్ కలైమగల్ దంపతుల కుమార్తె అయిన లక్ష్మి, వంటలు వండటంలో అద్భుత ప్రతిభ కనబరిచిందని ఈ సందర్భంగా యూనికో ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తన బిడ్డ లాక్ డౌన్ సమయంలో వంటలు వండటం నేర్చుకుందని, ఆమె వేగాన్ని, ప్రతిభను చూసిన తండ్రి వరల్డ్ రికార్డు కోసం కృషి చేయాలని ప్రోత్సహించారని లక్ష్మి తల్లి మీడియాకు వెల్లడించారు.
తనకు వరల్డ్ రికార్డు దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్ష్మి, తానిప్పుడు వివిధ రకాల తమిళ సంప్రదాయ వంటకాలను చేయగలనని, వంటగదిలో తల్లితో గడిపిన రోజులు తనకు వంటకాల్లో అనుభవాన్ని పెంచాయని చెప్పింది. గతంలో కేరళకు చెందిన పదేళ్ల శాన్వి అనే బాలిక, 30 రకాల వంటకాలను గంట వ్యవధిలో వండి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును లక్ష్మి అధిగమించింది.