Afghanisthan: జీవితబీమా చేయించుకున్న ఆఫ్ఘాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్.. ఆలస్యంగా వెలుగులోకి!
- 2016లో డ్రోన్ దాడుల్లో హతమైన తాలిబన్ చీఫ్
- రూ. 3 లక్షలు చెల్లించి జీవితబీమా కొనుగోలు
- 32 మిలియన్ రూపాయల విలువైన ఆస్తుల గుర్తింపు
నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడుల్లో హతమైన ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. డ్రోన్ దాడుల్లో మరణించడానికి ముందు అతడు నకిలీ గుర్తింపు కార్డులతో పాకిస్థాన్‌లో జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఇందుకోసం అతడు మూడు లక్షల రూపాయల ప్రీమియం చెల్లించాడు.
మన్సూర్ 21 మే 2016లో పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. తాలిబన్ వ్యవస్థాపకుడు, ఒంటికన్ను కలిగిన ముల్లా మొహమ్మద్ ఒమర్ 2013లో మరణించాడు. ఆ తర్వాత 2015లో మన్సూర్ తాలిబన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
మన్సూర్ తమ వద్ద ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టు గతేడాది కరాచీలోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ)కి బీమా కంపెనీ తెలియజేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించగా మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కరాచీలో మన్సూర్ 32 మిలియన్ పాకిస్థానీ రూపాయల (1,99,812 డాలర్లు) విలువైన ఐదు ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసినట్టు తేలింది. కాగా, ఇన్సూరెన్స్ సొమ్ము రూ. 3.50 లక్షల చెక్‌ను బీమా కంపెనీ గత శనివారం కోర్టులో డిపాజిట్ చేసింది.