Dirty Hari: ‘డర్టీ హరి’ సినిమా నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- స్త్రీల గౌరవాన్ని అవమానించేలా పోస్టర్లు
- నిర్మాత, పబ్లిషింగ్ ఏజెన్సీపై కేసులు నమోదు
- శ్రుతిమించిన సీన్లతో ట్రైలర్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై అతికించిన ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సినిమా నిర్మాత శివరామకృష్ణతోపాటు పబ్లిషింగ్ ఏజెన్సీపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు శ్రుతిమించి ఉండడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలాగే, పోస్టర్లు కూడా మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. మార్క్ కె రోబిన్ సంగీతం సమకూర్చగా శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ద్వారా సినిమా విడుదల కానుంది.