Nara Lokesh: రైతులకు న్యాయం చెయ్యాలని అడిగే అర్హత నాకు లేదట... చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాగలరా?: నారా లోకేశ్

Lokesh fires on YSRCP government over farmers suicides

  • జగన్ కు పాలించే అర్హత లేదన్న లోకేశ్
  • 18 నెలల్లో 468 మంది రైతులు బలయ్యారని వ్యాఖ్య 
  • జగన్ విధానాలే కారణం అంటూ ఆరోపణలు
  • మంత్రులు అపహాస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • రైతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ డిమాండ్

రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్న సీఎం జగన్ కు పాలించే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 18 నెలల పాలనలో 468 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై మంత్రులు సమాధానం చెప్పాలని నిలదీశారు. రైతుల కష్టాలను, ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. 48 గంటల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో హరిబాబు, ప్రకాశం జిల్లాలో రమేశ్ అనే రైతులు ఆత్మహత్యకు పాల్పడడం తనను తీవ్రంగా బాధించిందని లోకేశ్ వెల్లడించారు.

దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఇలాంటి పరిస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలే కారణమని ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఉద్ఘాటించారు. "రైతులకు న్యాయం చెయ్యాలని అడిగే అర్హత లోకేశ్ కు లేదంటూ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి, ఆ మంత్రులు చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాగలరా? మంత్రులు నన్ను ప్రశ్నించడం మాని జగన్ రెడ్డిని నిలదీస్తే రైతులకు న్యాయం జరుగుతుంది" అని వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News