Somu Veerraju: రాజధాని అమరావతే.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు

  • రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యం
  • అమరావతి కోసం బీజేపీ తరపున పోరాటం చేస్తాం
  • బీజేపీ మాట తప్పే పార్టీ కాదు
BJP supports Amaravathi says Somu Veerraju

అమరావతి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా బీజేపీ వైఖరి ఏమిటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు. తుళ్లూరులో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు  చెప్పారు. అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని... మోదీ అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏపీ బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందిస్తే... అమరావతిని మరింత అభివృద్ది చేస్తామని అన్నారు.

More Telugu News