Anil vij: కరోనాతో బాధపడుతున్న హర్యానా మంత్రి అనిల్ విజ్.. మెరుగైన వైద్యం కోసం రోహ్‌తక్ కు తరలింపు
- మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న మంత్రి
- ఆ తర్వాత సోకినట్టు నిర్ధారణ
- ఆరోగ్యం స్థిరంగా ఉందన్న వైద్యులు
ఈ నెల 5న కరోనా బారినపడిన హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్‌ను మెరుగైన వైద్యం కోసం అంబాలా సివిల్ ఆసుపత్రి నుంచి రోహ్‌తక్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. తనకు కొంత ఇబ్బందిగా ఉందని శనివారం రాత్రి వైద్యులకు మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహ్‌తక్ ఆసుపత్రిలోని వైద్యుల బృందం మంత్రిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు అంబాలా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుల్దీప్ సింగ్ తెలిపారు.
కొవాగ్జిన్ టీకా మూడోదశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి గత నెలలో తొలి షాట్ తీసుకున్నారు. అయితే, ఆయన తీసుకున్నది ప్లాసిబోనా, లేక టీకానా అన్న విషయంలో స్పష్టత లేదు. తొలి డోస్ తీసుకున్న 14 రోజులకు మంత్రి రెండో టీకా తీసుకోవాల్సి ఉండగా అంతలోనే ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
దీంతో ఆయనను అంబాలా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాస్త అసౌకర్యంగా ఉన్నట్టు చెప్పడంతో తాజాగా రోహ్‌తక్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. రెమ్‌డెసివిర్‌తోపాటు ప్లాస్మా థెరపీ చేయాలని వైద్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాాగా, 67 ఏళ్ల అనిల్ విజ్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన తొడ ఎముకకు శస్త్రచికిత్స జరిగింది.