New Delhi: రైతుల చలో ఢిల్లీ పిలుపు నేపథ్యంలో భారీగా మోహరించిన బలగాలు
- నేటి నుంచి ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రహదారుల దిగ్బంధం
- ఢిల్లీ, జైపూర్ మార్గంలో ఆందోళనలు
- కాసేపట్లో వేలాది సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు చలో ఢిల్లీకి పయనం
- రేపు దీక్ష
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనల విషయంలో రైతులు ఏ మాత్రం తగ్గకపోవడం, నేటి నుంచి ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రహదారుల్ని దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించడంతో అక్కడకు అదనపు బలగాలు చేరుకున్నాయి. ఢిల్లీ, జైపూర్ మార్గంలో ఆందోళనలకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దారిలోనూ పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.
వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చేస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్ నుంచి ఢిల్లీ, జైపూర్ జాతీయ రహదారి మీదుగా వేలాది సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు చలో ఢిల్లీకి సిద్ధమయ్యారు.
భారీగా అక్కడి నుంచి తరలి వెళ్లి రేపు ఉదయం నాటికి సింఘు సరిహద్దుకు చేరుకుని రైతు నేతలంతా నిరాహార దీక్ష చేయనున్నారు. రేపు వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనల్లో పాల్గొననున్నారు. ఈ నెల 19లోగా నూతన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఇప్పటికే రైతులు ప్రకటించారు.