Sonu Sood: సోనూసూద్ ఆత్మకథలో మదనపల్లె బాలికల ప్రస్తావన

A Farmers Daughters Pulling His Plough Shook Me Sonu Sood

  • ‘అయామ్ నో మెసయ్య’ పేరుతో ఆత్మకథ
  • బాలికల దుస్థితి తన మనసును మెలిపెట్టిందన్న సోను
  • కరోనా సృష్టించిన విలయానికి ఇది నిదర్శనమన్న నటుడు

లాక్‌‌డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న పేదలకు సాయం చేసి హీరోగా మారిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. తన ఆత్మకథ ‘అయామ్ నో మెసయ్య’ (నేను దేవదూతను కాను)లో చిత్తూరు జిల్లా మదనపల్లె అమ్మాయిల గురించి ప్రస్తావించాడు. ఆత్మకథలోని ఓ అధ్యాయాన్ని మొత్తం వీరి కోసమే కేటాయించాడు. ఈ ఏడాది జులై 25న శనివారం తన దృష్టిని ఓ వీడియో క్లిప్ ఆకర్షించిందని, చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ టమాటా రైతుకు సంబంధించిన ఈ క్లిప్‌ను కృష్ణమూర్తి అనే జర్నలిస్టు అప్‌లోడ్ చేశారని సోనూ సూద్ పేర్కొన్నాడు.

నాగలికి ఎద్దులు ఉండాల్సిన స్థానంలో రైతు తన కుమార్తెలను ఉంచడం చూసి తన మనసు కదిలిపోయిందని రాసుకొచ్చాడు. క్షణకాలం పాటు ఆ దృశ్యం తన హృదయాన్ని మెలిపెట్టిందని, స్కూల్లో ఉండాల్సిన అమ్మాయిలు పొలంలో నాగలి మోస్తూ కనిపించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు.  

కరోనా సృష్టించిన విలయానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శమన్న సోను కొన్ని గంటల్లో రైతు గురించి వివరాలు సేకరించినట్టు వివరించాడు. ఆ రైతు పేరు నాగేశ్వరరావు అని తెలిసి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఎడ్లు పంపుతానని మాటిచ్చానని, కానీ ఆయనకు కావాల్సింది ఎడ్లు కాదని, ట్రాక్టర్ అని తెలిసి వెంటనే అది పంపించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పాడు. వెంటనే చండీగఢ్‌లోని తన మిత్రుడు కిరణ్ గిల్హోత్రాకు ఫోన్ చేసి నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపించే ఏర్పాట్లు చేయమని చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

దీంతో అక్కడి సోనాలిక ట్రాక్టర్ ఏజెంటుకు అతడు ఫోన్ చేసి ఆదివారం సెలవు అయినప్పటికీ తక్షణమే స్పందించారని, ఫలితంగా ఆ రోజు సాయంత్రానికే నాగేశ్వర‌రావు పొలంలో ట్రాక్టర్ ఉందని సోను తన ఆత్మకథలో రాసుకున్నాడు.

  • Loading...

More Telugu News