Mucormycosis: కరోనా బాధితుల్లో కంటి చూపుతో పాటు ప్రాణాలను కూడా కబళిస్తున్న అరుదైన ఫంగస్!

Rare fungal infection emerges in corona patients

  • కరోనా బాధితులు, కోలుకున్నవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు
  • గుర్తించిన భారత వైద్య నిపుణులు
  • దీన్ని 'మ్యూకార్ మైకోసిస్' అంటారని వెల్లడి
  • ఇది సోకితే చనిపోయేందుకు 50 శాతం అవకాశాలు
  • కోలుకున్నవారిలో అంధత్వం
  • ఆసుపత్రుల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు

ఏమాత్రం ఆదమరిచినా కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర నష్టం కలుగుజేస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కరోనా బాధితుల్లో కనిపిస్తున్న అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించివేస్తోందని భారత వైద్యులు అంటున్నారు. ఈ అరుదైన ఫంగస్ కరోనాతో బాధపడుతున్న వారిపైనే కాకుండా, కరోనా నుంచి కోలుకున్నవారిపైన కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోందని గుర్తించారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను 'మ్యూకార్ మైకోసిస్' అంటారు.

అహ్మదాబాద్ కు చెందిన ఆక్యులర్ ట్రామా సర్జన్ పార్థ్ రాణా ఇలాంటివి పలు కేసులు గుర్తించారు. ఈ ఫంగస్ సోకిన వారిలో 50 శాతం మంది మరణించారని, దీన్నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డా వారి కంటి చూపు పోయిందని పార్థ్ రాణా వెల్లడించారు. ఈ ఫంగస్ సోకినవారిలో కనుగుడ్లు పెద్దవి మారి, పొడుచుకువచ్చినట్టుగా మారిపోయాయని తెలిపారు. సాధారణంగా కరోనా లేని వారిలో 'మ్యూకార్ మైకోసిస్' వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, కానీ కరోనా రోగుల్లో ఇది 2 నుంచి 3 రోజుల్లోనే పాకిపోతోందని అన్నారు.

సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ అతుల్ పటేల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత మూడు నెలల్లో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు 19 వచ్చాయని తెలిపారు. కరోనా వ్యాప్తి లేని సమయంతో పోల్చితే ఇప్పుడు దాని ముప్పు 4.5 రెట్లు అధికమైందని వెల్లడించారు. ఇది సోకితే ప్రాణం పోయేందుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయని, అందుకే ఆసుపత్రుల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News