Shivraj Singh Chowhan: మధ్యప్రదేశ్ లో బాలికలకు డ్రగ్స్ ఇచ్చి, వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఆటకట్టు
- ఇండోర్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టుచేశాం
- 21 మంది బంగ్లాదేశ్ బాలికలను రక్షించాం
- ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉంది
మన దేశంలో వ్యభిచార కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. విదేశాల నుంచి కూడా వ్యభిచారుణులను తీసుకొచ్చి దందా నడిపిస్తున్నారు. నగరాలే కాకుండా పట్టణాల్లో సైతం పెద్ద ఎత్తున ఈ దందా సాగుతోంది. ముఖ్యంగా పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి పేద బాలికలు, యువతులను ట్రాప్ చేసి, ఇండియాకు రప్పించి, వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.
మధ్యప్రదేశ్ లో గుట్టుగా సాగిస్తున్న ఒక వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. దీనికి సంబంధించిన విషయాలను సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. బంగ్లాదేశ్ నుంచి ఇండోర్ కు బాలికలను తీసుకొచ్చి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామని ఆయన తెలిపారు. 21 మంది బంగ్లాదేశ్ బాలికలను రక్షించామని చెప్పారు. బాలికలకు డ్రగ్స్ ఇచ్చి, వారితో వ్యభిచారం చేయించారని తెలిపారు. ఈ ముఠాకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉందని అన్నారు.
ఇండోర్ నగరంలోని జిమ్ శిక్షకులు కొందరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని చౌహాన్ చెప్పారు. యువకులకు వీరు డ్రగ్స్ ను అలవాటు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిని ఉపేక్షించబోమని, ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.