Warangal Rural District: గొర్రెకుంట సామూహిక హత్యల కేసు దోషికి మరో శిక్ష.. ఈసారి యావజ్జీవం!
- ఒక హత్యను కప్పి పుచ్చుకునేందుకు 9 మంది హత్య
- ఇప్పటికే ఉరి శిక్ష విధించిన కోర్టు
- బాధిత బాలిక కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
సంచలనం సృష్టించిన వరంగల్, గొర్రెకుంట సామూహిక హత్యల కేసు దోషి సంజయ్ కుమార్‌కు మరో శిక్ష పడింది. వివాహితతో సహజీవనం చేస్తూ మైనర్ అయిన ఆమె కుమార్తెను భయపెట్టి పలుమార్లు అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ మేరకు వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు (ప్రత్యేక కోర్టు) జడ్జి జయకుమార్ తీర్పు వెలువరించారు.
ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు 9 మందిని హత్య చేసిన దోషి సంజయ్ కుమార్‌కు ఇదే కోర్టు అక్టోబరు 28న ఉరిశిక్ష విధించింది. తాజాగా, బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు రుజువు కావడంతో యావజ్జీవ శిక్షతోపాటు రూ. 4వేల జరిమానా విధించింది. ఇతర శిక్షలను కూడా ఏక కాలంలో అమలు పరచాలని తీర్పు చెప్పింది. అలాగే, బాలిక బాధిత కుటుంబానికి పునరావాస పరిహారం కింద రూ. 4 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోక్సో చట్టం కింద ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని ఆదేశించడం ఇదే తొలిసారి.