Raghunandan Rao: ప్రొటోకాల్ పాటించని కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తాం: రఘునందన్ రావు
- దుబ్బాకకు కొత్త బస్టాండ్ మంజూరు చేయండి
- వరంగల్ విమానాశ్రయం పరిస్థితే సిద్ధిపేటకు వస్తుంది
- దుబ్బాకలో వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలి
సిద్ధిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని... వారిపై ఫిర్యాదు చేస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేనైన తనను వేదిక మీదకు పిలవలేదని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీని దుబ్బాకలో కాకుండా సిద్ధిపేటలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిని ఇంత వరకు పూర్తి చేయలేదని అన్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు ఇచ్చిన రింగురోడ్డును... దుబ్బాకకు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
సిద్ధిపేట మాదిరి దుబ్బాకకు కూడా నిధులను ఇచ్చి అభివృద్ధి చేయాలని రఘునందర్ డిమాండ్ చేశారు. వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని, కొత్త బస్టాండ్ మంజూరు చేయాలని కోరారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇస్తామన్నప్పుడు... దుబ్బాకకు కనీసం బస్టాండ్ కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయానికి 155 కిలోమీటర్ల పరిధిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండకూడదనే అగ్రిమెంట్ ఉందని... ఆ విషయం కేసీఆర్ కు తెలియదా? అని విమర్శించారు. విమానాశ్రయం తెస్తామని నాలుగేళ్ల క్రితం వరంగల్ కు హామీ ఇచ్చారని... ఆ విమానాశ్రయం పరిస్థితే సిద్ధిపేటకు కూడా వస్తుందని అన్నారు.