Avanthi Srinivas: మంత్రి అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం.. కోపంతో కారు దిగకుండానే వెళ్లిపోయిన వైనం!

Avanthi Srinivas fires on Simhachalam Trust members

  • మొక్కలు నాటే కార్యక్రమానికి వెళ్లిన అవంతి
  • అప్పటికే మొక్కలు నాటి వెళ్లిపోయిన ఇతర అతిథులు
  • ప్రొటోకాల్ కూడా పాటించరా? అని మండిపడ్డ అవంతి

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆయన సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన పూదోటను అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 9.15 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అవంతికి సమాచారం అందించారు. అయితే ఆయన వేరే కార్యక్రమంలో పాల్గొని 10.10 గంటలకు అక్కడకు చేరుకున్నారు.

అయితే అప్పటికే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తదితరులు మొక్కలు నాటి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అవంతికి పాలకమండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలకబోయారు. మిగిలిన అతిథుల గురించి అవంతి అడగ్గా... వారంతా వెళ్లిపోయారని అక్కడున్న స్థానిక వైసీపీ నేత సిరివరపు కృష్ణ, ట్రస్టీ సూరిశెట్టి సూరిబాబు తదితరులు సమాధానమిచ్చారు.

వారు ఉదయాన్నే రావడంతో వారితో మొక్కలు నాటించేశామని చెప్పారు. దీంతో, వారిపై అవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చేంత వరకు ఆగలేకపోయారా? అని మండిపడ్డారు. కనీసం ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం కూడా లేదా? అని నిలదీశారు. తనకు వీడియో కాన్ఫరెన్స్ తో పాటు మరో కార్యక్రమం కూడా ఉందని చెప్పి... కారు దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News