Uttam Kumar Reddy: టీపీసీసీ కోమటిరెడ్డి కేనా?... ముందుగానే అభినందనలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

Uttam Kumars All the Best to Komatireddy
  • నిన్న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
  • తుది నిర్ణయం తీసుకునే బాధ్యత సోనియాపై
  • ఎవరు అధ్యక్షుడైనా సహకరిస్తానన్న ఉత్తమ్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా, తదుపరి ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పదవికి పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, వీ హనుమంతరావు సహా పలువురు ఆశావహులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతల కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్ లో కోర్ కమిటీ సమావేశం జరుగగా, తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను సోనియా గాంధీకి అప్పగిస్తున్నట్టు మాత్రమే నిర్ణయం వెలువడింది. ఆపై ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

సమావేశం ముగియగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. దీంతో టీపీసీసీ బాధ్యతలు ఆయనకే దక్కవచ్చని, ఈ విషయం ముందే ఉత్తమ్ కు తెలిసిపోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా, కోర్ కమిటీలో తన అభిప్రాయాన్ని చెప్పలేదని, పార్టీ అధినేత్రి నిర్ణయమే తన నిర్ణయమని, ఎవరు అధ్యక్షుడైనా పూర్తిగా సహకరిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.
Uttam Kumar Reddy
Komatireddy Venkat Reddy
TPCC
TPCC President

More Telugu News