Pawan Kalyan: ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు... ఏమైపోయింది?: పవన్ కల్యాణ్
- ఏపీపీఎస్సీపై పవన్ విమర్శలు
- ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవు
- ఏపీపీఎస్సీకి ఓ ప్రణాళికంటూ లేదని వ్యాఖ్యలు
- నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన
- జాగ్రత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాలని హితవు
ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్ తీసుకువస్తామని చెప్పారని, ఆ క్యాలెండర్ సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ నియామకాల క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఆ దిశగా ఏమీ జరగలేదని విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల విషయంలో ఓ ప్రణాళిక అంటూ లేకపోవడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన సమస్యలు లేకుండా పరీక్షలు భర్తీ చేస్తారన్న నమ్మకాన్ని ఏపీపీఎస్సీ కోల్పోతోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఏపీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్లు తరచుగా వివాదాల పాలవుతున్నాయని తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు కాగా, ప్రిలిమ్స్ పరీక్ష పేపర్లో 51 తప్పులు వచ్చాయని నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆరోపించారు.
అంతేకాకుండా, ఇతర పోటీ పరీక్షల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయాలని, అభ్యర్థులు అన్ని పోటీ పరీక్షలు రాసే విధంగా సహకరించాలని పవన్ హితవు పలికారు.