KCR: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
- పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి రేపు భూమి పూజ
- అభినందనలు తెలిపిన కేసీఆర్
- దేశ ఆత్మగౌరవానికి ప్రతీకని వ్యాఖ్య
పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి రేపు భూమి పూజ చేయనున్న నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మగౌరవానికి, జాతి ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.
ప్రస్తుతమున్న పార్లమెంటు, కేంద్ర సచివాలయ భవనాలు అవసరాలకు తగినట్టుగా లేవనీ, పైగా అవి గత వలస పాలనకు చెందినవని, ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని అన్నారు.
కాగా, ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని మొత్తం వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఇందులో భాగంగా త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు.