onion: అమాంతం పెరిగిపోయిన కేపీ ఉల్లి ధర!
- భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలు
- విదేశాల్లో గిరాకీ అధికం
- వ్యాపారుల మధ్య పెరిగిన పోటీ
- క్వింటా కేపీ ఉల్లిని రూ.10 వేల నుంచి రూ.12,500 మధ్య కొన్న వైనం
ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనికి తోడు కేపీ ఉల్లిగడ్డలకు విదేశాల్లో గిరాకీ అధికంగా ఉండటంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి దాని ధర పెరిగిపోయింది. క్వింటా కేపీ ఉల్లిని రూ.10 వేల నుంచి రూ.12,500 మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇంత భారీగా ధర పలకలేదు.
ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కొత్తపల్లెలో ముగ్గురు వ్యాపారులు పోటీ పడుతూ ఏకంగా 40 టన్నుల కేపీ ఉల్లిని కొనుగోలు చేయడం గమనార్హం. ఖరీఫ్ సీజన్‌లో కర్నూలు, కడప జిల్లాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో కేపీ ఉల్లి సాగు కాగా, అధిక వర్షాల కారణంగా చాలాచోట్ల ఆ మొక్కలు దెబ్బతిన్నాయి. అంతేగాక, చాలా మంది రైతుల పంట కుళ్లిపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయి.