Shivraj Singh Chouhan: తన ఉనికిని కాపాడుకునేందుకు రైతులను అడ్డం పెట్టుకుంటోంది: కాంగ్రెస్‌పై శివరాజ్ సింగ్ ఫైర్
- హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన శివరాజ్ సింగ్
- కాంగ్రెస్‌ను మునిగిపోతున్న నావగా అభివర్ణన
- వ్యవసాయ చట్టాలపై రాజకీయం
- ఏపీఎంసీ చట్టంలో సవరణలు తేవాలంటూ శరద్ పవార్ అప్పట్లో నాకు లేఖ రాశారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను మునిగిపోయే నావలా అభివర్ణించిన ఆయన.. ఉనికి కాపాడుకునేందుకే రైతులను అడ్డంపెట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మాత్రం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఎస్పీ, శిరోమణి అకాలీదళ్, టీఎంసీ, వామపక్షాలు రైతు చట్టాలపై ఎంతటి వంచనకు దిగుతున్నాయో నేను చెప్పాలనుకుంటున్నా. 2011లో శరద్ పవార్ సాబ్ నాకు లేఖ రాస్తూ.. మార్కెటింగ్, మౌలిక సదుపాయాలలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ప్రత్యామ్నాయ పోటీ మార్కెటింగ్ మార్గాలను అందించడానికి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వారే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు’’ అని విచారం వ్యక్తం చేశారు. రైతు ఆందోళనల మాటున గందరగోళం సృష్టిస్తే సహించబోమని చౌహాన్ హెచ్చరించారు.