Eluru: అంతుచిక్కని ఏలూరు వింతవ్యాధి.. విష పదార్థమే అస్వస్థతకు కారణమా?

Toxic attack on nervous system in Eluru incident

  • మిస్టరీగా మారిన ఏలూరు ఘటన
  • నాడీ వ్యవస్థపై విషపదార్థాల ప్రభావం ఉందంటున్న వైద్యులు
  • హైదరాబాద్ సీసీఎంబీకి నమూనాలు
  • రిపోర్టుల కోసం 36 గంటలు వేచి చూడక తప్పని పరిస్థితి

ఏలూరు ఘటనపై వైద్య నిపుణులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ప్రజలు ఎందుకలా ఒక్కసారిగా అస్వస్థతకు గురవుతున్నారన్న విషయం మిస్టరీగా మారింది. జనం అకస్మాత్తుగా ఫిట్స్ బారినపడటం వెనక ఏం జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన వైద్య నిపుణులు నాడీ వ్యవస్థపై విషపదార్థాల ప్రభావం పడడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

వారు తినే ఆహారంలో ఆర్గానో  పాస్ఫేట్‌, లేదంటే ఫైలేత్రిం అనే విష పదార్థం కలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

తొలుత మెదడుపై ప్రభావం చూపించి ఆపై క్రమంగా ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మూర్ఛకు గురవుతారు. పట్టణంలో నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అలాగే, బాధితుల కళ్లలో ‘ప్యూపిల్‌ డైలటేషన్‌’ అనే సమస్య కూడా కనిపించింది. విషపదార్థ ప్రభావంతో కంటి లోపలి నల్లగుడ్డు స్పందన తగ్గుతుందని, కళ్లు బైర్లు కమ్ముతాయని వివరించారు.

మరోవైపు, బాధితులకు నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి సమస్య లేకపోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. బ్రెయిన్ సీటీ స్కాన్‌లోనూ ఏమీ బయటపడలేదు. పాలల్లో ఏమైనా కల్తీ జరిగిందేమో తెలుసుకునేందుకు తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీటి రిపోర్టులు రావాల్సి ఉంది. సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ అనాలసిస్ కోసం పది మంది బాధితుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఈ పరీక్షల్లో తేలిపోతుంది. రిపోర్టు వచ్చేందుకు మాత్రం మరో 36 గంటలు వేచి చూడక తప్పదు.

Eluru
Andhra Pradesh
doctors
nervous system
Toxic
  • Loading...

More Telugu News