GHMC: మీ సేవ సెంటర్లకు ఎవరూ రావద్దు... వరద బాధితుల వివరాలు తామే సేకరిస్తున్నామన్న జీహెచ్ఎంసీ!
- ఎన్నికల కారణంగా ఆగిపోయిన వరదసాయం పంపిణీ
- నేటి నుంచి ఇస్తారని దరఖాస్తు కోసం భారీ క్యూ
- తామే వివరాలు సేకరిస్తున్నామన్న జీహెచ్ఎంసీ కమిషనర్
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదసాయం పంపిణీ నిలిచిపోగా, 7వ తేదీ నుంచి తిరిగి పంపిణీ మొదలు పెడతామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉదయం మీ సేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వరద సాయం తమకు అందలేదని చెబుతూ, దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున క్యూ కట్టిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ స్పందించారు.
ఎవరూ మీ సేవ సెంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. తమ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని వెల్లడించిన ఆయన, వరదసాయం అందని వారి వివరాలను, బ్యాంకు ఖాతాలను స్వయంగా సేకరిస్తున్నారని తెలిపారు. బాధితుల ఖాతాలోనే సాయాన్ని జమ చేస్తామని ఆయన వెల్లడించారు. అర్హులను తామే గుర్తిస్తామని స్పష్టం చేశారు.