Chennai: చెన్నై నడిగర్ సంఘంలో అగ్నిప్రమాదం... కీలక పత్రాలు కాలిపోవడంతో అనుమానాలు!
- విలువైన పత్రాలు, సామగ్రి దహనం
- నిధులు, ఖర్చులకు చెందిన పత్రాలు అగ్నికి ఆహుతి
- కుట్ర కోణంపై అనుమానాలు
చెన్నైలోని నడిగర్ సంఘం భవనంలో అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తెల్లవారుజామున ప్రమాదం జరుగగా, విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో వచ్చి, మంటలను ఆర్పింది. అప్పటికే కార్యాలయంలోని కొంత సామానుతో పాటు విలువైన పత్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
నడిగర్ సంఘానికి చెందిన నిధుల వ్యయాల పత్రాలతో పాటు నాజర్ ప్రెసిడెంట్ గా, విశాల్ కార్యదర్శిగా ఉన్న సమయంలో వచ్చిన నిధులు, నిర్వహించిన కార్యక్రమాలకు వెచ్చించిన డబ్బు తదితర వివరాలన్నీ ఉన్న పత్రాలు కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా? లేదా ఎవరైనా కుట్ర చేశారా? అన్నది పోలీసుల విచారణలో తెలుస్తుందని నడిగర్ సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.