GHMC Elections: నేడు తేలిపోనున్న నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం!
- స్టాంపు ఓట్ల గందరగోళంతో నిలిచిన కౌంటింగ్
- నేడు మొదటి కేసుగా విచారించనున్న సింగిల్ జడ్జ్
- స్టాంపు ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్‌దే విజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో స్టాంపు ఓట్ల గందరగోళంతో ఆగిన నేరేడ్‌మెట్ ఫలితం నేడు తేలిపోనుంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కంటే స్టాంపు ఓట్లు ఎక్కువగా పోలవడంతో బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాంపు ఓట్లను పరిగణనలోకి తీసుకునే విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో నేరేడ్‌మెంట్‌లో ఎన్నికల లెక్కింపు నిలిపివేసిన అధికారులు నివేదికను ఈసీకి పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం హైకోర్టును సంప్రదించింది.
నేడు దీనిని మొదటి కేసుగా విచారించాలంటూ సింగిల్ జడ్జిని కోరింది. ఈ నేపథ్యంలో నేరేడ్‌మెట్ ఫలితంపై నేడు సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వనున్నారు. స్టాంపు ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు చెబితే కనుక టీఆర్ఎస్ అభ్యర్థికి విజయం సొంతమవుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే 504 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్టాంపు ఓట్లు 554 ఉన్నాయి. ఈ లెక్కన చెల్లని ఓట్లను పక్కన పెట్టినా టీఆర్ఎస్ అభ్యర్థినే విజయం వరిస్తుంది. అయితే, బీజేపీ అభ్యర్థి ప్రసన్నాయుడు మాత్రం పోలింగ్, కౌంటింగులో అక్రమాలు జరిగాయని, కాబట్టి ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.