Indiam Embasy: రైతులకు మద్దతుగా లండన్ వీధుల్లో వేల మంది నిరసన... పలువురి అరెస్ట్!
- భారత ఎంబసీ ముందు నిరసనలు
- రైతులకు మద్దతుగా నినాదాలు
- నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు
న్యూఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు నిరసనల సెగ బ్రిటన్ ను తాకింది. సెంట్రల్ లండన్ లో వేలమంది భారత సంతతి ప్రజలు నిరసనలకు దిగి, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారంటూ, పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తామంతా రైతులకు మద్దతిస్తున్నామని తెలిపారు.
లండన్ లోని ఆర్డ్ విచ్ వద్ద ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎదుటకు చేరుకున్న నిరసనకారులు, ట్రఫాల్గర్ స్క్వేర్ ఏరియాలో ప్రదర్శన నిర్వహించారని ఆ సమయంలో అక్కడే ఉన్న రాయిటర్ ఫోటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, నిరసనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని, నిరసనలకు అనుమతి లేదని వారు హెచ్చరించారు. ప్రజలు వినకపోవడంతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఈ నిరసనల్లో బ్రిటీష్ సిక్కులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెంది, ప్రస్తుతం లండన్ లో ఉన్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా భౌతికదూరాన్ని పాటించలేదని తెలుస్తోంది. కొద్దిమంది మాత్రమే ఫేస్ మాస్క్ లు ధరించారు. తమ కార్లను రోడ్లపై నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. ఈ ఆందోళనలపై స్పందించిన భారత హై కమిషన్ ప్రతినిధి, ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ఇండియాకు తెలియజేస్తామని, అయితే, అనుమతి లేకుండా ఇలా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగడం సరికాదని పేర్కొన్నారు.