Girls: అనుకోకుండా భారత సరిహద్దులోకి వచ్చిన పాకిస్థాన్ అమ్మాయిలు
- కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో ఘటన
- భారత భూభాగంలోకి ప్రవేశించిన పీవోకేకు చెందిన బాలికలు
- మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
- పొరబాటున వచ్చారని గుర్తింపు
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఎంతటి ఉద్రిక్తతలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు సైతం బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి తూటాలు దూసుకువస్తాయో తెలియక హడలిపోతుంటారు. అయితే, పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు బాలికలు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని అబ్బాస్ పూర్ కు చెందిన ఆ మైనర్లు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ దాటి పొరబాటున భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఇద్దరు అమ్మాయిలు ఎల్ఓసీ వెంబడి సంచరిస్తుండడాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకుంది. వారు అనుకోకుండా సరిహద్దులు దాటి ఇవతలికి వచ్చారని తెలుసుకున్న భారత సైన్యం తిరిగి వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రక్షణ శాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.