New Parliament: కొత్త పార్లమెంటు నిర్మాణానికి 10న భూమిపూజ చేయనున్న మోదీ

  • త్రిభుజాకారంలో ఉండబోతున్న కొత్త పార్లమెంటు
  • రూ. 861.90 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
  • 2022 నాటికి పూర్తి కానున్న నిర్మాణం  
PM Modi To Perform Ground Breaking Ceremony For New Parliament

కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి ప్రధాని మోదీ ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన నివాసానికి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఆహ్వానించారు. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కన దీన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మించబోతోంది. రూ. 861.90 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఎల్ అండ్ టీ కూడా బిడ్ వేసింది. అయితే టాటా కంటే కొంచెం ఎక్కువగా అంటే రూ. 865 కోట్లకు టెండర్ వేసింది. దీంతో, దానికంటే తక్కువ ధర కోట్ చేసిన టాటాకు కాంట్రాక్ట్ దక్కింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రూ. 940 కోట్లుగా అంచనా వేసింది.

కొత్త పార్లమెంటు భవనంలో ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింబించేలా కాన్స్టిట్యూషన్ హాల్ ఉంటుంది. దీంతో పాటు ఎంపీల లాంజ్, లైబ్రరీ, పెద్ద సంఖ్యలో కమిటీ గదులు, డైనింగ్ ఏరియాలతో పాటు సువిశాల పార్కింగ్ ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది ఉపాధిని పొందబోతున్నారు. 1200 మంది ఎంపీలకు సరిపడేలా భవనం ఉంటుందని ఓం బిర్లా తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఎడ్విన్ లూట్యెన్స్, హర్బర్ట్ బేకర్ ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ భవనం పాతబడిపోయిందని, కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకునే సమయంలో ఈ కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని ఓం బిర్లా చెప్పారు.

More Telugu News