Mallu Bhatti Vikramarka: జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై భట్టి కామెంట్
- జానారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
- కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయి
- బీజేపీ, ఎంఐఎం మతతత్వాన్ని రెచ్చగొట్టాయి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి ఆ పార్టీని వీడుతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో ఆయన చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పందిస్తూ, జానారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడంపైనే చర్చించామని భట్టి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మతతత్వాన్ని రెచ్చగొట్టాయని చెప్పారు. హైదరాబాదు నగరం ప్రమాదంలో ఉందంటూ ప్రచారం చేసుకుని టీఆర్ఎస్ లబ్ధి పొందిందని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈ మూడు పార్టీలు సీట్లను సాధించాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధాంతాలకు దూరంగా వెళ్లలేదని అన్నారు. ప్రస్తుత ఫలితాలను చూసి కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందవద్దని, ఇది తాత్కాలికం మాత్రమేనని, కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.