SI: బీజేపీ నేతలనుద్దేశించి మైలవరం ఎస్‌ఐ వ్యాఖ్యలు.. మండిపడిన నాయకులు
- రోడ్ల దుస్థితిపై ధర్నా చేసిన బీజేపీ శ్రేణులు
- నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
- కేంద్రంలో మాట్లాడి రోడ్లు వేసుకోవచ్చన్న ఎస్ఐ
బీజేపీ నేతలను ఉద్దేశించి మైలవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎస్ఐ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో రహదారిపై ఈరోజు బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెల్వడం-నూజివీడు రహదారిపై బీజేపీ చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా చేపట్టే నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఎస్ఐ రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను పెంచాయి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్లు బాగు చేయించుకోవచ్చు కదా? అని ఎస్ఐ అన్నారు. దీంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ మాటలు చెప్పేందుకు నీవెవరివి? అంటూ మైలవరం నియోజవర్గ ఇంచార్జి బాల కోటేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఎస్ఐ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటన గురించి సమాచారం అందుకున్న సీఐ శ్రీను అక్కడకు వచ్చి బీజేపీ నేతలతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు.