Jagan: ఏపీ వ్యాప్తంగా బీజేపీ ధర్నా.. జగన్ పై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్!

AP BJP holds state wide protest on damaged roads
  • రోడ్ల దుస్థితిపై ధర్నా చేపట్టిన బీజేపీ
  • రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయన్న విష్ణు
  • జగన్ కు ఓట్లు, సీట్లు తప్ప మరో ఆలోచన లేదని మండిపాటు
తెలంగాణలో క్రమంగా బలోపేతమవుతున్న బీజేపీ ఏపీలో కూడా దూకుడు పెంచే ప్రయత్నంలో ఉంది. ప్రభుత్వ  పనితీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా రోడ్ల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. విజయవాడలోని మొగల్రాజపురం మధు చౌక్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. రోడ్లు గుంతలమయంగా మారడంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కనీసం గోతులు పూడ్చే పనిని కూడా ప్రభుత్వం చేయడం లేదని దుయ్యబట్టారు. పంచాయతీ రాజ్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే... ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారని మండిపడ్డారు.

వైసీపీ గాలిలో గెలిచిన పార్టీ అని విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ గాలిలోనే హెలికాప్టర్ లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ గడిపేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. రూ. 6 వేల కోట్లు పెట్టి భూములు కొన్నారని, ఇంత వరకు పేదలకు పట్టాలను మాత్రం పంచలేదని... కానీ, కమీషన్లను మాత్రం కొట్టేశారని అన్నారు. ఓవైపు వైసీపీ నేతల ఆస్తులు పెరిగిపోతుంటే... మరోవైపు ప్రజల ఆస్తులు మాత్రం తరిగిపోతున్నాయని చెప్పారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని... దీంతో, పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విష్ణు చెప్పారు. ఈ 18 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని రహదారులు వేసింది, ఎన్ని పనులు చేసింది? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ కు ఓట్లు, సీట్లు తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు.
Jagan
YSRCP
Vishnu Vardhan Reddy
BJP
AP Roads
Dharna

More Telugu News