Vijayashanti: టీఆర్ఎస్, ఎంఐఎం కవలల అసలు రంగు బయటపడే సమయం వచ్చింది: విజయశాంతి
- గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశం
- టీఆర్ఎస్ పై విజయశాంతి విమర్శలు
- కుట్రతో పోలింగ్ కు వెళ్లారని ఆరోపణ
గ్రేటర్ ఫలితాలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ (76) చేరుకోలేకపోయిన నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యానిస్తూ, టీఆర్ఎస్, ఎంఐఎం కవలల అసలు రంగు బయటపడే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కవలల్లా ఉంటూ వచ్చిన ఈ రెండు పార్టీలకు కమల పరీక్ష ఎదురైందని తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరంలేదని టీఆర్ఎస్ నేతలు, తల్చుకుంటే గులాబీ సర్కారును రెండు నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారని విజయశాంతి వివరించారు. మరి, మేయర్ విషయంలోనూ ఇద్దరూ అదే మాట మీద ఉంటారా అని ప్రశ్నించారు. లేదంటే, మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని, మళ్లీ ఎన్నికలకు సిద్ధమని టీఆర్ఎస్ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
"కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆర్ఎస్ చివరికి మొత్తం స్థానాల్లో మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారు. ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకూడదన్న కుట్రతో వరుస సెలవులు ఉన్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసి రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లారు. కొత్త ఓటర్ల నమోదుకు, జాబితాల సవరణకు అవకాశమే ఇవ్వలేదు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి పేర్లు, చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. ఆఖరికి అనుభవం లేని సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించారు.
కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చినా మేయర్ పదవికి ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ, చివరికొచ్చేసరికి ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కేట్టు కనిపించడంలేదు" అని విశ్లేషించారు.