Gram Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమన్న ఏపీ హైకోర్టు

AP High Court denies to give stay on Panchayt Elections

  • ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీ నిర్ణయం
  • హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
  • ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపణ
  • మూడుసార్లు సంప్రదించామన్న ఎస్ఈసీ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

వాదనల సందర్భంగా... కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం అతిక్రమించిందని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున లాయర్ అశ్విన్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ, ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సుప్రీంకు వెళితే తమ తప్పిదాలు బయటపడతాయనే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసిందని అన్నారు. అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల నిర్ణయం ఏకపక్షం కాదని, ఇప్పటికే ఎన్నికల సంఘం మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని స్పష్టం చేశారు.

దీంతో ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అడిగారు. ఈ నేపథ్యంలో, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని, ప్రభుత్వ న్యాయవాది మరో అవకాశం అడిగినందున తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నామని పేర్కొంది.

  • Loading...

More Telugu News