China: 40 ఏళ్ల తర్వాత తొలిసారి.. చంద్రుడిపై మట్టిని సేకరించిన చైనా అంతరిక్ష నౌక
- అమెరికా, రష్యా సరసన చేరిన చైనా
- చంద్రుడి పైనుంచి 2 కేజీల మట్టి సేకరణ
- చైనా స్పేస్ ఏజెన్సీని అభినందించిన అమెరికా
అంతరిక్ష రంగంలో చైనా మరోమారు సత్తా చాటింది. చంద్రుడిపైకి ఆ దేశం పంపిన అంతరిక్ష నౌక చాంగె-5 జాబిల్లిపై ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతంనుంచి మట్టిని సేకరించింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన నిలిచింది. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.
చంద్రుడి ఉపరితలం నుంచి రెండు మీటర్ల లోతు నుంచి దాదాపు 2 కేజీల మట్టిని చాంగె-5 సేకరించిందని, మరికొన్ని శాంపిళ్లను సేకరిస్తోందని అధికారులు తెలిపారు. చంద్రుడిపై నుంచి మట్టిని సేకరించిన సందర్భంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చైనా స్పేస్ ఏజెన్సీని అభినందించింది. కాగా, 1976లో చివరిసారి సోవియట్ యూనియన్ కు చెందిన లూనా 24 మిషన్ చంద్రుడి పైనుంచి 200 గ్రాముల మట్టిని సేకరించి తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు చైనా నౌక 2కేజీల మట్టిని సేకరించి భూమికి తీసుకొస్తోంది.