Chandrababu: చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. ఇప్పుడు నాటకాలాడొద్దు: చంద్రబాబు
- ప్రభుత్వ చేతకానితనంతో పోలవరంకు సమస్యలు వస్తున్నాయి
- కేసుల భయంతో కేంద్రాన్ని అడగలేకపోతున్నారు
- 22 మంది వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లింది. పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు శాసనసభ అట్టుడికింది. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతో పోలవరం ప్రాజెక్టుకు అనేక సమస్యలు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల భయంతో నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని అన్నారు.
ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలు విని వైసీపీకి 22 మంది ఎంపీలను, 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు కట్టబెట్టారని... ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకపోతే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ఒప్పించకపోతే ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా నిలిచిపోతారని అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రంపై పోరాడతాం, అన్నీ సాధిస్తామని చెప్పి, ఇప్పుడు డ్రామాలు ఆడొద్దని అన్నారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. కేంద్రానికి భయపడే వ్యక్తి జగన్ కాదని అన్నారు. సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెను ఎదిరించిన చరిత్ర జగన్ దని చెప్పారు. 2021 డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు.