Deep Depression: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.... దక్షిణ కోస్తాకు వర్ష సూచన
- ఈ సాయంత్రానికి తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
- రేపటి నుంచి తమిళనాడు, కేరళ, ఏపీలో వర్షాలు
- డిసెంబరు 3న అతి భారీ వర్షాలు!
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది నేటి సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'బురేవి' అని పిలవనున్నారు. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు, ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపానుగా బలపడిన అనంతరం డిసెంబరు 2న ట్రింకోమలీ వద్ద తీరం దాటనుంది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడులోని పలు ప్రాంతాలు, కేరళ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, డిసెంబరు 3న తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, కేరళలో 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.