Kumaram Bheem Asifabad District: కుమురం భీం జిల్లాలో మరోమారు విరుచుకుపడిన పులి.. తల్లి కళ్లముందే కుమార్తెను పొట్టనపెట్టుకున్న వైనం!

Tiger kills girl in kumaram Bheem Asifabad district
  • ఈ నెల 11న విఘ్నేశ్ అనే యువకుడిని చంపిన పులి
  • పత్తి ఏరేందుకు వెళ్లిన బాలికపై దాడి
  • బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగం హామీ
తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో పులి మరోమారు చెలరేగిపోయింది. ఈ నెల 11న విఘ్నేశ్ అనే 19 ఏళ్ల యువకుడిని పొట్టనపెట్టుకున్న పులి.. తాజాగా నిన్న ఓ బాలిక ప్రాణాలు తీసింది.  పత్తి ఏరుతున్న బాలికను తల్లి, సోదరుడు, కూలీలు చూస్తుండగానే ఈడ్చుకెళ్లింది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి శివారులో జరిగిందీ ఘటన.

అన్నెం సత్తెయ్య అనే రైతు పొలంలో పత్తి ఏరేందుకు నిర్మల (16), ఆమె సోదరుడు రాజేశ్, తల్లి లక్ష్మక్క, మరో ఏడుగురు కూలీలు వెళ్లారు. మధ్యాహ్నం వరకు పత్తి ఏరిన అనంతరం వారిలో కొందరు భోజనానికి కూర్చోగా, నిర్మల, మరో స్నేహితురాలితో కలిసి చేనుకు మరో వైపున పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా వారిపై దాడిచేసిన పులి నిర్మలను నోట కరుచుకుని వెళ్లిపోయింది. నిర్మల అరుపులు విని అప్రమత్తమైన వారు కర్రలతో వెంబడించడంతో కొద్దిదూరం వెళ్లాక నిర్మలను వదిలిపెట్టి వెళ్లిపోయింది.

అయితే, అప్పటికే తీవ్ర గాయాలపాలైన నిర్మల అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ శాంతారాం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
Kumaram Bheem Asifabad District
tiger
girl
kill
Telangana

More Telugu News