అరేబియా సముద్రంలో కూలిన మిగ్-29కే శకలాలను గుర్తించిన నేవీ

29-11-2020 Sun 21:51
  • గురువారం కూలిపోయిన యుద్ధవిమానం
  • గోవా తీరంలో కొన్ని శకలాలు లభ్యం
  • గల్లంతైన పైలెట్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం
Navy found debris of crashed Mig fighter craft

కొన్నిరోజుల కిందట మిగ్-29కే యుద్ధ విమానం అరేబియా సముద్ర జలాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఓ పైలెట్ ను సహాయక బృందాలు కాపాడగా, పైలెట్ కమాండర్ నిషాంత్ సింగ్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కాగా, కూలిపోయిన విమానం తాలూకు శకలాలను నేవీ గుర్తించింది. గోవా తీర ప్రాంతంలో కూలిపోయిన మిగ్-29కే విమానం కోసం 9 యుద్ధనౌకలు, 14 విమానాలు గాలిస్తున్నాయని, తాజాగా కొన్ని శకలాలను స్వాధీనం చేసుకున్నామని రక్షణ శాఖ వెల్లడించింది. కాగా ఈ గాలింపు చర్యల్లో నేవీ ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ క్రాఫ్ట్ కూడా పాల్గొంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవాళ లభ్యమైన శకలాల్లో విమానం ల్యాండింగ్ గేర్, టర్బో చార్జర్, ఫ్యూయెల్ ట్యాంక్, వింగ్ ఇంజిన్ కౌలింగ్ ఉన్నట్టు వివరించారు. గురువారం ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక నుంచి గాల్లోకి ఎగిసిన ఈ మిగ్-29కే కొద్దిసేపటికే కూలిపోయింది.