దేశవాళీ క్రికెట్ ఎలా నిర్వహిద్దాం?... రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు 4 ఆప్షన్లు ఇచ్చిన బీసీసీఐ

29-11-2020 Sun 20:23
  • ఇటీవలే మళ్లీ మొదలైన క్రికెట్ సందడి
  • దేశవాళీ క్రికెట్ కోసం బీసీసీఐ ప్రతిపాదనలు
  • దేశవ్యాప్తంగా బయో సెక్యూర్ బబుల్స్
BCCI proposes four options to conduct domestic cricket in country

గత మార్చి నాటికి కరోనా వ్యాప్తి తీవ్రం కావడంతో ఆగిపోయిన క్రికెట్ ఇటీవలే పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో భారత్ లో దేశవాళీ క్రికెట్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవాళీ పోటీలను ఎలా నిర్వహించాలన్న దానిపై అన్ని సభ్య క్రికెట్ సంఘాలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశారు. బీసీసీఐ ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాల ముందు 4 ఆప్షన్లు ఉంచారు.

ఆప్షన్-1: కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే నిర్వహించడం.
ఆప్షన్-2: కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించడం.
ఆప్షన్-3: రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కూడా నిర్వహించడం.
ఆప్షన్-4: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించడం.

ఈ ఆప్షన్లలో అత్యధిక సభ్య సంఘాలు దేనివైపు మొగ్గుచూపితే ఆ విధంగా దేశవాళీ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లాలని బీసీసీఐ భావిస్తోంది. రంజీ ట్రోఫీకి 67 రోజులు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 22 రోజులు, విజయ్ హజారే టోర్నీకి 28 రోజులు అవసరమవుతాయని గంగూలీ తన లేఖలో వివరించారు. ఇక, యూఏఈలో ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహించిన తరహాలో దేశం మొత్తమ్మీద 6 బయో సెక్యూర్ బబుల్స్ ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది.