డిసెంబరు 2న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

29-11-2020 Sun 18:51
  • ఏపీపైనా పంజా విసిరిన నివర్
  • పలు జిల్లాల్లో భారీ నష్టం
  • క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలతో చర్చించిన పవన్
Pawan Kalyan decides to visit Nivar cyclone effected areas

తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నివర్ ప్రభావంతో ఏపీలోని అనేక జిల్లాల్లో కుండపోత వానలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

ఈ నేపథ్యంలో, డిసెంబరు 2న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నివర్ తుపాను ప్రభావిత జిల్లాల నాయకులతో పవన్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదానిపై చర్చించారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించాలని పవన్ భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

నివర్ తుపానుతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీయడంతో పంటలు కోల్పోయి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.