Amit Shah: మేం హామీ ఇచ్చామంటే అమలు చేసి తీరుతాం: అమిత్ షా

  • హైదరాబాదులో అమిత్ షా ప్రెస్ మీట్
  • నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర హోంమంత్రి
  • తన ప్రశ్నలకు కేసీఆర్ బదులిస్తారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యలు
Amit Shah press meet in Hyderabad

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఘనంగా స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్ షోలో ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీదే అని నమ్ముతున్నానని స్పష్టం చేశారు.

జాతీయ నాయకులు హైదరాబాద్ కు వరదలా వస్తున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, మరి హైదరాబాద్ నగరంలో వరదలు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎందుకు రాలేదని అమిత్ షా ప్రశ్నించారు. హైదరాబాద్ వరదల్లో 7 లక్షల మంది జనం ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే నాలాలపై అక్రమణ నిర్మాణాలను తొలగించి చూపిస్తామని స్పష్టం చేశారు. మంచి పరిపాలన అందిస్తామని నగర ప్రజలకు వాగ్దానం చేస్తున్నామని చెప్పారు. మేం మాటిచ్చామంటే అమలు చేసి తీరుతాం అని అమిత్ షా ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

100 రోజుల్లో అభివృద్ధి అనే నినాదం ఇచ్చి ఐదేళ్లు అయిందని అన్నారు. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తామన్నారు... అదేమైంది? గాంధీ, ఉస్మానియా తరహాలో నాలుగు ఆసుపత్రులన్నారు... అవేమయ్యాయి? అని నిలదీశారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెబుతారనే ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.

మోదీకి ప్రజాదరణ వస్తుందనే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ రాజకీయాల వల్లే పేదలకు సరైన వైద్యం అందడంలేదని తెలిపారు. ఎంఐఎం కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. హైదరాబాద్ కు నిజాం సంస్కృతి నుంచి విముక్తి కలిగిస్తామని అన్నారు.

More Telugu News