మళ్లీ బాక్సింగ్ రింగ్ లో దిగిన మహాబలుడు మైక్ టైసన్

29-11-2020 Sun 14:48
  • రాయ్ జోన్స్ తో టైసన్ ఎగ్జిబిషన్ బౌట్
  • డ్రాగా ముగిసిన పోరు
  • వయసు పెరిగినా చేవ తగ్గని టైసన్
Boxing legend Mike Tyson re entered

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (54) తన వయసు పెరిగినా చేవ తగ్గలేదని చాటాడు. పదిహేనేళ్ల తర్వాత బాక్సింగ్ బరిలో దిగిన ఈ మహాబలుడు రాయ్ జోన్స్ జూనియర్ (51) తో జరిగిన ఎగ్జిబిషన్ బౌట్ లో తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపించాడు. అయితే మాజీ ప్రపంచ చాంపియన్ రాయ్ జోన్స్ జూనియర్ కూడా దీటుగా పోరాడడంతో ఈ బౌట్ డ్రాగా ముగిసింది. అయినప్పటికీ చాన్నాళ్ల తర్వాత టైసన్ ను బాక్సింగ్ రింగ్ లో చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మైక్ టైసన్ చివరిసారిగా 2005లో కెవిన్ మెక్ బ్రైడ్ తో బౌట్ లో పాల్గొన్నాడు. ఇందులో టైసన్ కు పరాజయం ఎదురైంది. తాజా పోరులో టైసన్ ఎక్కువగా బాడీ షాట్స్ కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పవర్ పంచ్ లను తట్టుకోవడం రాయ్ జోన్స్ జూనియర్ కు శక్తికి మించిన పనైంది. టైసన్ సంధించిన బాడీ షాట్స్ కారణంగానే తాను త్వరగా అలిసిపోయానని బౌట్ అనంతరం రాయ్ జోన్స్ వెల్లడించాడు.

కాగా ఈ బౌట్ లో తొలి రౌండ్ లో రాయ్ జోన్స్ ఆధిపత్యం సాగించగా, రెండో రౌండ్ లో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలిచారు. మూడో రౌండ్ లో టైసన్ హవా సాగింది. ఈ ఎగ్జిబిషన్ బౌట్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో జరిగింది.