Pawan Kalyan: మంత్రాలయం మఠానికి చెందిన భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he opposes the auction of Mantralayam lands

  • సర్కారు కేవలం ట్రస్టీగానే వ్యవహరించాలన్న పవన్
  • తామే యజమానులం అనుకోవద్దంటూ హితవు
  • లేకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక

మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం ట్రస్ట్రీగా మాత్రమే వ్యవహరిస్తూ ఆస్తులను సంరక్షించాలే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదని తెలిపారు.

దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉందని, గతంలో టీటీడీ దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పవన్ పేర్కొన్నారు. మే 25న టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ జీవో 888ను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, మఠాల ఆస్తులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

"ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గినప్పుడే వేలం, విక్రయం అనే ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో అమ్మకానికి పెడితే మనోభావాలు దెబ్బతిన్న భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది" అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు అని హితవు పలికారు.

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి

నివర్ తుపానుతో ఏపీ రైతాంగం తీవ్రంగా నష్టపోవడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థికపరమైన చేయూత ఇవ్వాలని  తెలిపారు. క్షేత్రస్థాయి సమాచారం పరిశీలిస్తే, సుమారు రూ.1000 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు తెలుస్తోందని వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు  ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని కోరారు.

వాతావరణ హెచ్చరికల ప్రకారం రాబోయే కొన్నిరోజుల్లో మరో తుపాను పొంచి ఉందని తెలుస్తోందని, ప్రజలను అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు కూడా భాగస్వాములు కావాలని పవన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News