నన్ను ఫాలో అవ్వండి... అంటూ సచిన్ కు దారిచూపిన ఆటోవాలా!

27-11-2020 Fri 20:20
  • ముంబయి శివార్లలో దారితప్పిన సచిన్
  • హైవేకు చేరుకోలేక ఇబ్బందులు
  • సచిన్ ను హైవే వద్దకు చేర్చిన ఆటోవాలా
Mumbai auto driver helps Sachin Tendulker to get on highway

భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఓ లెజెండ్. మంత్రందండం వంటి తన బ్యాట్ తో బంతికి బౌండరీ దారి చూపిన ఈ మహోన్నత క్రికెటర్ కు ముంబయి ట్రాఫిక్ లో ఓ ఆటోవాలా దారి చూపిన వైనం ఆసక్తి కలిగిస్తోంది. ఓ పని మీద ముంబయి శివారు ప్రాంతానికి వెళ్లిన సచిన్ కు అక్కడంతా గందరగోళంగా అనిపించింది. తిరిగి హైవే చేరుకోవాలంటే ఎటు వెళ్లాలో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. దాంతో హైవే చేరుకోవాలంటే ఎటువైపు వెళ్లాలని ఓ ఆటో డ్రైవర్ ను అడిగారు.

అయితే, తనను రూట్ చెప్పమని అడిగింది క్రికెట్ గాడ్ కావడంతో ఆ ఆటోవాలా ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇంకేమీ ఆలోచించకుండా, "నన్ను ఫాలో అవ్వండి... నా ఆటో వెనుకే రండి" అంటూ బదులిచ్చాడు. అంతేకాదు, తన ఆటోను హైవే దిశగా తీసుకెళ్లి సచిన్ కు దారి చూపించాడు. ఆ ఆటోనే ఫాలో అయిన సచిన్ చివరికి హైవే చేరుకుని హమ్మయ్య అనుకున్నారు. ఆ ఆటోవాలాకు ఓ సెల్ఫీ ఇచ్చి సంతోషం కలిగించారు.

కాగా ఈ ఘటన గత జనవరిలో చోటుచేసుకోగా, ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.