Cyclones: నివర్ తో అయిపోలేదు... తరుముకు వస్తున్న మరో రెండు తుపానులు!
- పూర్తిగా బలహీనపడిన నివర్
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపానుల సీజన్
- బురేవి, టకేటి తుపానులతో తమిళనాడు, ఏపీకి ముప్పు
ఆగస్టు నుంచి డిసెంబరు వరకు బంగాళాఖాతంలో తుపానుల సీజన్ నడుస్తుంది. ఈసారి సీజన్ ముగిసే దశలో సంభవించిన నివర్ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. తమిళనాడు, ఏపీల్లో తీవ్ర నష్టానికి కారణమైంది. ప్రస్తుతం నివర్ పూర్తిగా బలహీనపడినట్టు తెలుస్తోంది. అయితే, వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం ఈ సీజన్ లో నివర్ చివరిది కాదని తెలుస్తోంది. నివర్ తర్వాత మరో రెండు తుపానులు రాబోతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది బలపడి డిసెంబరు 2న తుపానుగా మారుతుందని, తుపానుగా మారితే దీన్ని 'బురేవి' అని పిలుస్తారని తెలిపింది. ఇది తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.
ఇక, మరో తుపాను పేరు 'టకేటి'. మధ్య బంగాళాఖాతంలో డిసెంబరు 5న ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారితే దాన్ని 'టకేటి' అని పిలవనున్నారట. టకేటి ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడిస్తోంది.