IIIT: నివర్ ఎఫెక్ట్: ఏపీలో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటీ పరీక్ష వాయిదా
- ఏపీ జిల్లాలను అతలాకుతలం చేసిన నివర్
- ట్రిపుల్ ఐటీ పరీక్షను వాయిదా వేసిన అధికారులు
- తిరిగి డిసెంబరు 5న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు
నివర్ తుపాను రైతులను, ప్రజానీకాన్నే కాదు, విద్యార్థులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. తమిళనాడులో తీరం దాటిన ఈ తుపాను ధాటికి ఏపీలోని 10 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఏపీలో రేపు నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. పలు జిల్లాల్లో పరీక్ష నిర్వహించడం కష్టసాధ్యం కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపడిన ఈ పరీక్షను డిసెంబరు 5న నిర్వహిస్తామని ఆర్జీయూకేటీ కన్వీనర్ డి.హరినారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
ఇప్పటికే జారీ అయిన హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, ఆ హాల్ టికెట్లపైనే, అవే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని వివరించారు. ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యేవారు ఏదైనా గుర్తింపు కార్డుతో 2 గంటలు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. కాగా, నివర్ తుపాను క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా మారింది.