Asaduddin Owaisi: మాపై మతం ముద్ర వేస్తున్నారు... నన్ను జిన్నా అని ప్రచారం చేస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
- ఎంఐఎం మనసులను కలిపేందుకు ప్రయత్నిస్తుంది
- రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నా అంటారా?
- 1960 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తున్నాం
ఉగ్రవాదానికి మతం ఉండదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ దాన్ని ప్రతిసారి ఒకే మతంతో ముడిపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎంఐఎంపై మతతత్వ పార్టీ అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమది మతతత్వ పార్టీ కాదని, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ అని అన్నారు. తనను కూడా జిన్నా అంటూ ప్రచారం చేస్తున్నారని... రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నా అని ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.
ఎంఐఎం పార్టీ మనసులను కలిపేందుకే ప్రయత్నిస్తుందని... మనసులను విడగొట్టేలా చేయదని అసద్ అన్నారు. 1960 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని... అలాంటి తమ పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా బీజేపీ ఆరోపిస్తోందని విమర్శించారు. హైదరాబాదును వరదలు ముంచెత్తితే సాయం చేయడానికి ఎవరూ రాలేదని... కానీ ఓట్ల కోసం మాత్రం క్యూ కడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోని దాదాపు 200 కార్పొరేషన్లు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాయని... అందుకే బీజేపీ దృష్టి హైదరాబాదుపై పడిందని అన్నారు.