Delhi High Court: మేజర్ అయిన అమ్మాయి నచ్చిన వాడితో ఉండొచ్చు: ఢిల్లీ హైకోర్టు

  • ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన సులేఖ అనే యువతి
  • నా ఇష్టం మేరకే ఇంటి నుంచి వచ్చేశానని కోర్టుకు తెలిపిన వైనం
  • వారి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశం
Major girl can live with who ever she likes says Delhi High Court

ఢిల్లీ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. మేజర్ అయిన అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తితో ఎక్కడైనా ఉండొచ్చని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే, సెప్టెంబర్ 12న సులేఖ అనే యువతి తన ప్రియుడు బబ్లూతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తన చెల్లెలు కిడ్నాప్ కు గురైందంటూ ఆమె అన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. బబ్లూ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

దీంతో, అమ్మాయి జాడ కనిపెట్టాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అమ్మాయి జాడను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు విచారించింది. తన ఇష్ట ప్రకారమే బబ్లూను పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చానని ఆమె చెప్పింది. తాను మేజర్ నని తెలిపింది.

దీంతో, ఆమె కోరుకున్నవాడితో ఉండొచ్చని కోర్టు తెలిపింది. సులేఖ కుటుంబసభ్యులు వీరి విషయంలో జోక్యం చేసుకోరాదని... ఆమె సోదరుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. సులేఖ, బబ్లూకి వారు ఉంటున్న ప్రాంతంలోని బీట్ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. వాళ్లకు ఎప్పుడు అవసరమైనా... వెంటనే పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

More Telugu News