శ్రీనగర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికుల మృతి

26-11-2020 Thu 17:08
  • పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సైనికులపై కాల్పులు
  • తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరు జవాన్లు
  • దాడి చేసిన వెంటనే కారులో పరారైన ముష్కరులు
2 Soldiers Killed In Terror Attack On Army Patrol Near Srinagar

జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయాయి. శ్రీనగర్ శివార్లలోని హెచ్ఎంటీ ప్రాంతంలో సైనికులపై దాడి చేశాయి. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లపై ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, మన సైనికులపై ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ప్రాంతంలో జైషే మొహమ్మద్ కదలికలు ఉన్నాయని... సాయంత్రంలోగా ఈ ఘాతుకానికి పాల్పడిన గ్రూపు ఏదో గుర్తిస్తామని తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే ఉగ్రవాదులు కారులో పరారయ్యారని చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థానీలు, ఒకరు స్థానికుడని భావిస్తున్నామని తెలిపారు.

జమ్ము-శ్రీనగర్ హైవేపై ఉన్న నగ్రోటా వద్ద ఓ ట్రక్కులో దాక్కున్న నలుగురు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇటీవలే మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు.