నాగార్జున చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్?

26-11-2020 Thu 16:31
  • లాక్ డౌన్ లో ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు 
  • మొగ్గుచూపని అగ్ర హీరోల సినిమాలు 
  • నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్'
  • నిర్మాతలతో నెట్ ఫ్లిక్స్ సంప్రదింపులు    
Fancy offer from OTT to Nagarjuna movie

లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అయితే, అదే సమయంలో కొందరు నిర్మాతలను ఓటీటీ ఆదుకుంది. మంచి రేటు ఆఫర్ చేసి కొన్ని సినిమాలను ఆయా ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. అయితే, అగ్ర హీరోల చిత్రాలు మాత్రం ఓటీటీకి వెళ్లకుండా థియేటర్ల కోసమే ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అగ్రనటుడు నాగార్జున చిత్రం ఒకటి ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఎన్ఐఏ అధికారిగా నటిస్తుండగా.. దియామీర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. దీంతో నిర్మాతలు అటువైపు మొగ్గుచూపుతున్నట్టు, ప్రస్తుతం హక్కుల విషయమై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.