Kishan Reddy: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. కేసీఆర్ అబద్ధాలు చెప్పారు: కిషన్ రెడ్డి

  • జనాలను భయపెట్టి ఓట్లు సాధించాలనుకుంటున్నారు
  • పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను తొలగించాలన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • మత కలహాలు ఎక్కడ జరిగినా బీజేపీ ఊరుకోదు
Power is not permanent to any one says Kishan Reddy

హైదరాబాదులో కొన్ని శక్తులు అరాచకాలకు పాల్పడాలని చూస్తున్నాయని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి  కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో ప్రజలను భయపెట్టి ఓట్లు సాధించాలనుకుంటున్నారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని... పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని... కేవలం వ్యవస్థలు మాత్రమే ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. ఏళ్ల తరబడి కుటుంబ పాలన కొనసాగించుకోవచ్చని రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పలేదని అన్నారు.

తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా చాటిన పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లను తొలగించాలని ఎంఐఎం నేత అక్బర్ మాట్లాడటంపై మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ మిత్రపక్షాలని చెప్పారు. ఘాట్ లు తొలగించాలన్న వారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీపై కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా మత కల్లోలాలు లేవని, ఎక్కడా కర్ఫ్యూలు లేవని చెప్పారు. దేశంలో ఎక్కడ మతకలహాలు జరిగినా కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ తప్పుడు ప్రచారాలను చేయడం మానుకోవాలని అన్నారు.

More Telugu News